
- ఐదుగురిపై అభియోగాలు మోపిన ఈడీ
- సౌత్‌గ్రూప్‌ను శరత్ రెడ్డి, కవిత, మాగుంట నియంత్రించారు
- ఎల్ 1 లైసెన్సుల్లో 65% ఈ గ్రూప్‌కు.. ఇందులో 32% కవితకు!
- ఇండోస్పిరిట్‌కు ఇల్లీగల్ మార్గంలో రూ.192.8 కోట్ల లాభం
- ఈ సంస్థలో కవితకు భాగం ఉందని అరుణ్ పిళ్లై స్టేట్‌మెంట్
- సమీర్ మహేంద్రుపై 268 పేజీల చార్జ్‌షీట్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తున్నది. సౌత్‌గ్రూప్‌లో కీలకంగా వ్యవహరించిన ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో కవిత పేరును చేర్చింది. గతంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లోనూ ఆమె పేరును ఈడీ పేర్కొన్నది. సౌత్ గ్రూప్‌లో సమీర్ మహేంద్రు, కవిత కీలకంగా వ్యవహరించినట్లు వివరించింది. లిక్కర్ పాలసీ మార్పు ద్వారా వచ్చిన ఎల్ 1 లైసెన్సుల్లో 65 శాతం సౌత్‌గ్రూప్ కంట్రోల్‌లోకి వెళ్లిందని, ఇందులో 32 శాతం కవితకు అందిందని పేర్కొంది. ఈ స్కామ్‌లో అభిషేక్‌రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డితోపాటు కవితపై తీవ్రమైన అభియోగాలు మోపింది. మొత్తం 268 పేజీల చార్జ్‌షీట్‌లో సౌత్‌లాబీ వివరాలు వెల్లడించింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను మంగళవారం ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
సౌత్ గ్రూప్ పేరిట 192 కోట్ల లిక్కర్ దందా జరిగినట్లు చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్‌లో లిక్కర్ పాలసీ మీటింగ్స్‌లో భాగంగా 2022 జనవరిలో హైదరాబాద్‌లోని కవితను ఆమె నివాసంలో సమీర్ మహేంద్రు కలిసినట్లు ప్రస్తావించింది. అంతకుముందు 2021మేలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కవిత ఇంట్లోనే అభిషేక్ బోయిన్‌పల్లిని సమీర్ మహేంద్రు కలిసినట్లు పేర్కొంది. తర్వాత అరబిందో శరత్ చంద్రారెడ్డికి అభిషేక్‌ని పరిచయం ఏర్పడినట్లు తెలిపింది. సౌత్ గ్రూప్‌ను శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లను విజయ్ నాయర్‌కు చేర్చినట్లు వెల్లడించారు. సీబీఐ దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా ధ్రువీకరించిన విషయాన్ని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్‌కు చెందిన ఇండో స్పిరిట్ ద్వారా ఢిల్లీ, హైదరాబాద్‌లో పలు మీటింగ్స్ జరిగినట్లు వెల్లడించింది. సీబీఐ కేసులో నిందితుడైన అరుణ్ రామచంద్ర పిళ్ళైని తన తరఫున ప్రతినిధిగా వివిధ మీటింగ్స్‌లో పాల్గొనేలా కవిత చేశారని పేర్కొన్నది. పాలసీ మార్పు ద్వారా ఎల్1 లెసెన్స్‌లు పొందారని, ఈ క్రమంలోనే ఇండో స్పిరిట్‌కి రూ.192.8 కోట్లు లాభం వచ్చిందని తెలిపింది. నేరపూరితమైన మార్గంలో ఈ డబ్బు పొందినట్లు చెప్పింది.
ఇండోస్పిరిట్‌లో కవితకు భాగం
గతేడాది నవంబర్ 11న అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో.. ఇండో స్పిరిట్ సంస్థలో కవితకు భాగస్వామ్యం ఉన్నట్లు తెలిపాడని చార్జ్‌షీట్‌లో ఈడీ వెల్లడించింది. కవిత తరఫున ప్రతినిధిగా అరుణ్ పిళ్లై పలు మీటింగ్స్‌లో హాజరుకావడంతో పాటు సమీర్‌ను కలిశాడని వివరించింది. పిళ్లై ద్వారా అభిషేక్‌రావు సహా లిక్కర్ స్కామ్‌లో సౌత్‌గ్రౌప్‌కు చెందిన నిందితులు అంతా కవిత సూచనల మేరకు నడుచుకున్నారని తెలిపింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న అరుణ్ రామచంద్రపిళ్లైకి వి.శ్రీనివాసరావు అనే వ్యక్తి రూ.కోటి అందజేసినట్టు శ్రీనివాస్‌రావు తన స్టేట్‌మెంట్‌లో తెలిపాడని వివరించింది. ఇలా పాలసీ చేంజ్ చేయడంలో సౌత్‌గ్రూప్‌కు చెందిన కవిత, అభిషేక్‌రావు బోయిన్‌పల్లి, అరుణ్ రామచంద్రపిళ్లై, ఈడీ కేసులో అరెస్ట్ అయిన శరత్‌చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపింది.