ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం : అప్రూవర్ గా మారిన వైసీపీ ఎంపీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం : అప్రూవర్ గా మారిన వైసీపీ ఎంపీ

దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం నమోదైంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అప్రూవర్ గా మారారు. అనంతరం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట రేట్ కు(ఈడీ) కేసుకు సంబంధించిన కీలక సమాచారం అందించారు. లిక్కర్ కేసులో  ఎక్కువ మంది అప్రూవర్స్ గా మారిన వైనం ఆసక్తి రేపుతోంది.

లిక్కర్ కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారారు శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి. రాఘవ రెడ్డి తో పాటు ఇప్పటికే అప్రూవర్ గా మారారు శరత్ చంద్రారెడ్డి. రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా అనేక మందిని ఈడీ ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ నుండి ఢిల్లీకి నగదు బదిలీలపై ప్రధానంగా ఈడీ ఫోకస్ పెట్టింది.

 దర్యాప్తు స్తబ్దుగా ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నా అంతర్గతంగా జరగాల్సింది జరుగుతోందని ఈడీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ టార్గెట్ గా దూకుడు పెరుగుతుందని, తెలంగాణకు సంబంధించి కీలక వ్యవహారాలు తెరమీదకు రానున్నాయని దర్యాప్తు సంస్థల వర్గాల వెల్లడించాయి. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో అక్రమ నగదు బదిలీల వ్యవహారాలపై ఈడీ దృష్టి పెట్టింది. హవాలా వ్యవహారాలు నడిపే 20మందికిపైగా కీలక వ్యక్తులను ఈడీ అధికారులు ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబును ఇటీవల మరోమారు ప్రశ్నించింది ఈడీ. రానున్న రోజుల్లో మరికొంతమందిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.

 జీ20 సదస్సు ముగిశాక లిక్కర్ కేసులో అసలు కథ ప్రారంభం అవుతుందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. కొంతకాలంగా లిక్కర్ కేసు స్కాంలో ఎలాంటి కదలికా లేదు. దీనిపై ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వ జోక్యం వల్ల దర్యాప్తు సంస్థలు ఈ కేసును నీరుగార్చాయని విమర్శిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం దర్యాప్తు సబ్దుగా సాగుతున్నట్లు కనిపించినా, అంతర్గతంగా అవసరమైన విచారణ జరుగుతోందని ఈడి వర్గాలు అంటున్నాయి.