నేను, వాజపేయి తప్ప మిగతా ప్రధానులంతా కాంగ్రెస్ స్కూల్ నుంచి వచ్చినోళ్లే

నేను, వాజపేయి తప్ప మిగతా ప్రధానులంతా కాంగ్రెస్ స్కూల్ నుంచి వచ్చినోళ్లే

వ్యాపారాలు చేయడమన్నది ప్రభుత్వం చేయాల్సిన పని కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ ఆయన ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అంశంపై మాట్లాడారు. ప్రభుత్వం పని వ్యాపారాలు చేయడం కాదని, పేదలకు మేలు చేయడమని అన్నారు. పేదలకు తిండి దొరికేలా చేయడం, ఇండ్లు, మరుగుదొడ్లు కట్టించడం, రక్షిత తాగు నీటిని అందించడం, మంచి వైద్యం అందేలా చూడడం, రోడ్ల నిర్మాణం, చిన్న సన్నకారు రైతులను ఆదుకోవడం ప్రభుత్వం చేయాల్సిన పని అని మోడీ చెప్పారు. పేదలకు ఇవన్నీ అందేలా చేయడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. దీనిని ఎవరైనా సోషలిజం అంటే తాను స్వాగతిస్తానని అన్నారు. ఫేక్ సోషలిజం గురించి మాట్లాడాల్సి వస్తే అది కచ్చితంగా కుటుంబ రాజకీయాల ప్రస్తావనే అవుతుందని చెప్పారు. రామ్ మనోహర్ లోహియా, జార్జ్ ఫెర్నాండెజ్, నితీశ్ కుమార్ లాంటి వాళ్ల కుటుంబాలను చూస్తే నిజమైన సోషలిజం అంటే ఏంటో తెలుస్తుందని అన్నారు. వాళ్లు నిజమైన సోషలిస్టులని అన్నారు.

ఒకే కుటుంబంలో 45 మందికి పదవులా?

వారసత్వ రాజకీయాలు మన దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు అని మోడీ చెప్పారు. కొంతమంది సోషలిస్టులమని చెప్పుకునే ఫేక్ సమాజ్ వాదీలు ఉన్నారని, వాస్తవానికి వాళ్లు కుటుంబవాదులని అన్నారు. గతంలో తనకు ఒక లెటర్ వచ్చిందని, అందులో సమాజ్ వాదీ పార్టీలో ఒకే కుటుంబానికి చెందిన 45 మంది వేర్వేరు పదవుల్లో ఉన్నారని వివరించారని అంటూ ములాయం, అఖిలేశ్ యాదవ్ రాజకీయాలపై ధ్వజమెత్తారు. ఏదైనా ఒక పార్టీని కొన్ని తరాల పాటూ ఒకే కుటుంబం నడిపితే అక్కడ దేశం అభివృద్ధి కాకుండా కుటుంబ అభివృద్ధే లక్ష్యంగా మారుతుందని అన్నారు. జమ్ము కశ్మీర్ లో రెండు పార్టీలను రెండు కుటుంబాలు మాత్రమే నడుపుతూ వచ్చాయని, ఇదే ట్రెండ్ హర్యానా, జార్ఖండ్, యూపీ, తమిళనాడు వరకూ చాలా రాష్ట్రాల్లో కనిపిస్తోందని మోడీ చెప్పారు.

వారసత్వ పార్టీల్లో ఒకే కుటుంబంలో వాళ్లే సుప్రీం

వారసత్వ రాజకీయ పార్టీల్లో ఒకే కుటుంబం ఎప్పటికీ సుప్రీం పవర్ గా ఉంటుందని మోడీ అన్నారు. పార్టీ మంచిగా ఉందా? లేదా? అన్నదిగానీ, దేశం మంచిగా ఉందా? లేదా? అన్నది గానీ వారికి అక్కర్లేదని, తమ కుటుంబానికి చెందిన వాడే పార్టీ చీఫ్ గా ఉన్నాడా లేదా అన్నది ఒక్కటే చూసుకుంటారని చెప్పారు. పొలిటికల్ పార్టీల్లో ప్రజాస్వామ్యం ఉండాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత బీజేపీకి రావడం తప్ప మరో పార్టీలో చేరలేని పరిస్థితి ఉందని అన్నారు. దీనికి కారణం ఒక్క బీజేపీ మాత్రమే ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తోందని, తమ పార్టీలో మాత్రమే యువత ఎదగడం సాధ్యమని మోడీ చెప్పారు. దేశంలో తాను, అటల్ బిహారీ వాజపేయి తప్ప మిగిలిన ప్రధానులంతా కాంగ్రెస్ స్కూల్ నుంచి వచ్చినోళ్లేనని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఇప్పుడు దానిపై మాట్లాడటం సరికాదు: ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మోడీ

పాకిస్థాన్ మంత్రికి అసదుద్దీన్ ఒవైసీ చురకలు

మమ్మల్ని గెలిపిస్తే.. బైక్పై ముగ్గురు వెళ్లినా నో చలాన్