కబడ్డీ ఆడుతున్న బాలికను ఎత్తుకెళ్లి చంపేశారు

కబడ్డీ ఆడుతున్న బాలికను ఎత్తుకెళ్లి చంపేశారు

మహారాష్ట్ర పూణేలోని బిబెవాడీలో ఘోరం వెలుగుచూసింది. కబడ్డీ ఆడుతున్న ఓ 14 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపేశారు కొందరు దుండగులు. 8వ తరగతి చదువుతున్న ఆ బాలికను రిషికేశ్ భగవత్ (22) అనే వ్యక్తి కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం కబడ్డీ ప్రాక్టీస్‌కు వెళ్లిన బాలికను రిషికేశ్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఎత్తుకెళ్లారు. రోడ్డు మీదకు తీసుకొచ్చి ఆమెపై ఆయుధాలతో దాడికి తెగబడ్డారు. కత్తులతో ఆమె గొంతుతోపాటు ఇతర శరీర భాగాల్లో పొడిచారు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలిక అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.  

‘కబడ్డీ ప్రాక్టీస్ కోసం బిబెవాడీ ఏరియాలోని యశ్ లాన్స్‌కు సాయంత్రం 5.45 గంటలకు బయలు దేరింది బాలిక. ప్రాక్టీస్ మొదలుపెట్టిన బాలిక వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చి మాట్లాడాలని చెప్పి రోడ్డు మీదకు తీసుకెళ్లి వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆమెపై కత్తులతో దాడికి తెగబడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలిక స్పాట్‌లోనే చనిపోయింది. దీంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. నిందితుల్లో ఇద్దరినీ మేం పట్టుకున్నాం. వాళ్లిద్దరూ మైనర్లు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నాం’ అని బిబెవాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఎస్‌ఐ సునీల్ జవారే తెలిపారు. ప్రధాన నిందితుడైన రిషికేశ్ భగవత్ బాలికకు దూరపు బంధువన్నారు. కొన్నాళ్లుగా బాలిక ఇంట్లోనే అతడు నివసిస్తున్నాడన్నారు. అయితే బాలికను రిషికేశ్ ప్రేమిస్తున్న విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో అతడ్ని ఇంట్లో నుంచి పంపించేశారని ఆయన పేర్కొన్నారు. 

బొమ్మ తుపాకీతో బెదిరించి..

ఘటనా ప్రాంతంలో ఓ బొమ్మ తుపాకీ దొరికిందని.. బాలికను బెదిరించేందుకు దీన్ని వాడి ఉండొచ్చని  సీనియర్ పోలీసు అధికారి నమ్రతా పాటిల్ తెలిపారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు. బాలికను రిషికేశ్ ప్రేమించాడన్న విషయం తమకు తెలుసని ఇన్వెస్టిగేషన్‌ సమయంలో నిందితులు చెప్పారన్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. బాలిక హత్యను ఖండించిన పవార్.. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు.  

మరిన్ని వార్తలు: 

సావర్కర్‌ను జాతిపిత చేస్తారేమో?: అసదుద్దీన్ ఒవైసీ

పాక్‌కు వెళ్లిన ముస్లింలకు గౌరవం దక్కట్లే: మోహన్ భగవత్

ఆలయంలోకి మందు బాటిల్​తో వెళ్లిన ఆర్జీవీ